అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారు. జత్వానిపై అక్రమంగా కేసు నమోదు, అరెస్టు వ్యవహారంలో పలువురు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడడంతో దీని వెనుక సూత్రధారులను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రభుత్వం భావించింది.
దీంతో ఈ కేసులకు సంబంధించి అన్ని రికార్డులను సీఐడీకి అప్పగించాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జత్వాని ఫిర్యాదు మేరకు నాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జత్వాని కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు.