ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ – మంత్రి క్లారిటీ

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ పెట్టారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తోంది. సూపర్ సిక్స్‌ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ఇప్పటికే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. మరోవైపు.. ఇటీవలె ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు గెలిచినప్పటినుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు దాదాపుగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మంత్రి ప్రకటన తో తేలిపోయింది. ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయినట్లు ఉంది. అందుకే మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలుపెట్టాలని చూస్తున్నారు.