ప్రజలు భారీ మార్పు కోరుకుంటున్నారు. మార్పు తెస్తాం: కలెక్టర్లు సహకరించాలన్న డిప్యూటీ సీఎం

ap-deputy-cm-pawan-kalyan-speech-at-collectors-conference

అమరావతి: ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం ఇదే..ఈ భేటీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరయ్యారు.. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి సిద్ధమైంది సర్కార్‌.. ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ప్రజలు భారీ మార్పు కోరుకుంటున్నారని తాజా ఎన్నికల ఫలితాలు నిరూపించాయని తెలిపారు. ఈ పరిస్ధితికి రావడానికి తామంతా చాలా నలిగిపోయి వచ్చామన్నారు. గత ప్రభుత్వం తమపై చేసిన దాడులు, కేసుల్ని భరించి వచ్చామంటే వ్యవస్థలను బతికించడానికేనన్నారు. మీరు ఎంతో కష్టపడి కలెక్టర్లు అయ్యారని, అలాంటి వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్ణుపట్టించిందన్నారు. కాబట్టి అలాంటి వ్యవస్దను బతికించడానికే తాము ఇక్కడికి వచ్చామన్నారు. బ్రూరోక్రాట్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాము ఇక్కడ ఉన్నామన్నారు. ఏపీ విభజనకు ముందు కూడా ఇంత ఇబ్బంది పడలేదన్నారు.

గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీపడేవారని, రాష్ట్రం మోడల్ స్టేట్ గా ఉండేదని కొందరు బ్రూరోక్రాట్లు తనతో చెప్పారని పవన్ తెలిపారు. కానీ తాము ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో తెలిసిందన్నారు. ఇప్పుడు పాత రోజుల్ని తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అనుభవం, ఆయన దిశానిర్దేశం రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుందని తమకు నమ్మకం ఉందన్నారు. తాను తీసుకున్న శాఖల్లో మీ సహాయసహకారాలు కావాలని పవన్ కలెక్టర్లను కోరారు.

ఒకే రోజు రాష్ట్రం మొత్తం 13326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయిస్తామని పవన్ తెలిపారు. 2014-19 మధ్యలో 10 వేల గ్రామాల్లో ప్రారంభించిన ఘనవ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. పిఠాపురంలో ద్రవ వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు, స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన టాయిలెట్లను కొనసాగిస్తామని, 2024 చివరి నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తామన్నారు. 4221 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల రిపేర్లకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఉన్నా ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్దల్ని పనిచేయనీయకుండా చేశారని పవన్ ఆరోపించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థల్ని బలోపేతం చేయడానికే ఉందన్నారు. చంద్రబాబు తన అనుభవంతో తమకు దిశానిర్దేశం చేస్తారన్నారు. తమ వల్ల తప్పు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను పవన్ కోరారు. ఈ ప్రక్రియలో ఓ అడుగు ముందుకు పడాలన్నారు. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, విభజన నుంచీ తాము నలుగుతూనే ఉన్నామన్నారు. విభజన తర్వాత అవమానాలు, బాధలు పడి రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తుంటే మరో ప్రభుత్వం వచ్చి తమను రాష్ట్రంలోకే రానివ్వకుండా అడ్డుకుందన్నారు.