కర్ణాటక సీఎంను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Deputy CM Pawan Kalyan meet Karnataka CM

బెంగళూరు: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు (గురువారం) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సిద్ధరామయ్యకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కల్యాణ్ కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌తో ఉపముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఏపీలో అటవీ ఏనుగుల ఆగడాలను అడ్డుకోవడానికి కుమ్కీ ఏనుగులను ఇవ్వాలని కోరనున్నారు.

విజయనగరం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల్లో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ సమస్య దీర్ఘకాలంగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగులను అడవిలోకి తరిమేందుకు కుమ్కీ ఏనుగులను పంపాలని మంత్రి ఈశ్వర్‌ను కోరనున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే యోచనలో పవన్ ఉన్నారు.