సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ

AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును నేడు సీఎంకు ఆయన అందజేశారు. పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి వెంట పలువురు కాంగ్రెస్, జనసేన నేతలు పాల్గొన్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో మున్నేరు వాగు.. ఏపీలో బుడమేరు పొంగి పొర్లాయి. మహోగ్రరూపం దాల్చిన మున్నేరు ఖమ్మంను ముంచెత్తగా.. బుడమేరు విజయవాడను ముంచేసింది. ఈ వరదలకు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్లలో ఆస్తి నష్టం వాటిళ్లింది. ఈ నేపథ్యంలో వదర బాధితులకు అండగా తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తన సొంత నిధుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరి కోటి రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీకి ప్రకటించిన రూ. కోటి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు. అదే సమయంలో ముంపునకు గురైన గ్రామాలకు.. రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు పవన్. ఇక తెలంగాణకు సైతం కోటి విరాళం ప్రకటించిన పవన్.. బుధవారం నాడు ఆ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.