నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP CM Chandrababu to head to Delhi today

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (శుక్రవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం (రేపు) అక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సాయంత్రం 5గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

ఏపీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చంద్రబాబు మాట్లాడనున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సహా, పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అవుతారనే విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. డయాఫ్రం వాల్‌పై కేబినెట్‌లో తీర్మానం చేశారు. నీతి అయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండటంతో దానిపై కేబినెట్‌లో చర్చించారు.