అన్విత గ్రూప్‌ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు

హైదరాబాద్‌ సమీపంలోని కొల్లూరు వద్ద ‘ఇవానా’ ప్రాజెక్టు.. 12.9 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో 1,850 యూనిట్ల నిర్మాణం.. మీడియాతో అన్విత గ్రూప్‌ సీఎండీ అచ్యుతరావు బొప్పన..

Anvita Group is a huge housing complex project of Rs.2,000 crore

హైదరాబాద్‌: హైదరాబాద్‌, రియల్టీ రంగంలో ఉన్న అన్విత గ్రూప్‌ రూ.2,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఇవానా పేరుతో హైదరాబాద్‌ సమీపంలోని కొల్లూరు వద్ద భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో భాగంగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని 2024 డిసెంబర్‌లోగా కొనుగోలుదార్లకు అప్పగిస్తారు. ఇక రెండవ దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో కస్టమర్లకు అందజేస్తామని అన్విత గ్రూప్‌ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రారంభ ఆఫర్‌ కింద చదరపు అడుగు రూ.6,500లకు విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. నిర్మాణ వ్యయం తొలి దశ ప్రాజెక్టుకు రూ.380 కోట్లు, రెండవ దశకు రూ.1,600 కోట్లకుపైగా అవుతుందని అంచనాగా చెప్పారు. 1 నుంచి 34వ అంతస్తు వరకు 1,360-2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2-3 పడక గదులను నిర్మిస్తారు. 35-36 అంతస్తుల్లో స్కై విల్లాలు 4 బెడ్రూంలతో 2,900-5,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతంగా రానున్నాయి. కారు పార్కింగ్‌ స్థలం సైతం మొదట్లోనే రిజిస్ట్రేషన్‌సహా అప్పగిస్తారు. ఇవానా మొదటి దశలో 8 లక్షలు, రెండవ దశలో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉంటాయని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు.

అన్ని ఆదాయ వర్గాలకు అనువుగా.. ఇవానా గృహ సముదాయాన్ని అన్ని ఆదాయ వర్గాలకు అనువుగా నిర్మిస్తున్నట్టు అచ్యుతరావు తెలిపారు. తాను సైతం మధ్యతరగతి నుంచి వచ్చానని చెప్పారు. ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్‌ హౌస్‌లు నిర్మిస్తున్నామని.. ఇవి కాక టవర్లపైన ఒక లక్ష చదరపు అడుగుల్లో గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు 3 బేస్‌మెంట్‌ పార్కింగ్‌ల తరువాత ఒక ఫ్లోర్‌ మొత్తాన్ని చిన్నారులు, పెద్దల వ్యాహ్యాళికి అనువుగా కేటాయించామని చెప్పారు. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్స్‌ ఉంటాయి.