విజయవాడకు మరో టెన్షన్

విజయవాడ వాసులను బుడమేరు వాగు మరోసారి భయపెడుతోంది. భారీ వర్షాలకు పులివాగు, బుడమేరు వాగుల ప్రవాహం పెరుగుతోంది. దీంతో వరద నీరు బెజవాడలోకి రాకుండా బుడమేరు వద్ద నిన్న పూడ్చిన గండ్ల ఎత్తును పెంచుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి పనులను పర్యవేక్షించారు. మరోవైపు విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు.

ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.