అలర్ట్ : పొంచి ఉన్న మరో తీవ్ర ప్రమాదం..

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే భారీ వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు సొంతిళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. వరదలు తెచ్చిన బురద, చెత్తాచెదారంతో దోమలు విజృంభించనున్నాయి. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు పెరగనున్నాయి. వీటిని అరికట్టడంపై ప్రభుత్వ విభాగాలు దృష్టిసారించాల్సి ఉంది. లేదంటే ఆరోగ్య విపత్తు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇదిలా ఉంటె మరో అల్ప పీడనం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.