జనవరిలో తెలంగాణ లో మరో డీఎస్సీ ..?

జనవరి లో తెలంగాణ లో మరో డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. గత కొద్దీ రోజులుగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, పోస్టులు పెంచి మళ్లీ కొత్త డేట్ తో నిర్వహించాలంటూ నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భట్టి మీడియా తో మాట్లాడుతూ ..జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి తీరుతాం అని క్లారిటీ ఇచ్చారు.

11 వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నాం. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశాం. గత ప్రభుత్వం గ‌తేడాది సెప్టెంబర్ మాసంలో 5 వేల పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,75,527 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆ 5 వేల పోస్టుల‌కు, మరో 6000 కలిపి 11 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. మొత్తంగా 2.79 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి తీరుతామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

ఇక డీఎస్సీ ఉద్యోగాలు పెంచాలని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్లో టెట్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా 1.03 లక్షల మంది విధుల్లో ఉన్నారు.