ఆగస్టు 15 నుండి అందుబాటులోకి అన్న క్యాంటీన్లు..?

ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం తొలి దశలో 183 క్యాంటీన్లు తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన వీటన్నింటికి రూ.20 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాఖలుకు ఈ నెల 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

మరోవైపు క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విరాళాలపై పన్ను మినహాయింపు దక్కే సూచనలు ఉన్నాయి. ఇక అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్‌ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్న క్యాంటిన్లు ప్రారంభించారు.. అక్కడ భోజనం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో కూడా కొందరు టీడీపీ నేతలు వారి, వారి నియోజకవర్గాల్లో ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతిరోజూ పేదలకు భోజనం అందుబాటులోకి తెచ్చారు. ఆ అన్న క్యాంటిన్లు కూడా ఇప్పటికి కొనసాగుతున్నాయి. వీటిని మినహాయించి ఇప్పుడు మరికొన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.