- రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన శ్యామల
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయనకు సంఘీభావం ప్రకటించారు. గౌరవనీయమైన అర్చకుడిపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని శ్యామల తెలిపారు.

మత సామరస్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ దాడి ఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అర్చకుల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని మరోసారి వెల్లడించారు.రంగరాజన్ గారి వ్యక్తిత్వాన్ని ప్రస్తావించిన శ్యామల, ఆయన ఎంతో మందికి ఆత్మీయ సేవలు అందించిన వ్యక్తి అని అన్నారు. చిలుకూరు ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఆయన విశ్వసనీయత తెలుసునని, ఎప్పుడూ అందరికీ స్వామివారి దర్శనం కల్పించేందుకు కృషి చేస్తారన్నారు. అలాగే, ఆయన దివ్యాంగ భక్తులను స్వయంగా మోసుకుని స్వామివారి దర్శనం చేయించే గొప్ప మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. అలాంటి సేవా ధృక్పథం ఉన్న వ్యక్తిపై దాడి జరగడాన్ని ఆమె ఖండించారు.
రంగరాజన్‌కు ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని, ఈ ఘటనపై న్యాయమైన చర్యలు తీసుకోవాల్సిందేనని శ్యామల స్పష్టం చేశారు. అర్చకుల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.