జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆమ్ర‌పాలి

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆమ్ర‌పాలి బుధువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమ్ర‌పాలికి రొనాల్డ్ రోస్‌తో పాటు ప‌లువురు అధికారులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆమ్ర‌పాలి..స్వ‌స్థ‌లం ఒంగోలులోని ఎన్ అగ్ర‌హారం. ఆమె త‌ల్లిదండ్రులు కాటా వెంక‌ట‌రెడ్డి, ప‌ద్మావ‌తి. విశాఖ‌లోనే ఉన్న‌త విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఏపీ కేడ‌ర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. 2013లో వికారాబాద్ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో అద‌న‌పు చీఫ్ ఎల‌క్ట్రోర‌ల్ ఆఫీస‌ర్‌గా ప‌ని చేసిన ఆమ్ర‌పాలి, కేంద్ర ప్ర‌భుత్వంలోకి డిప్యూటేష‌న్‌పై వెళ్లారు. నాటి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డికి ప్ర‌యివేటు సెక్ర‌ట‌రీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 2020 సెప్టెంబ‌ర్‌లో ప్ర‌ధాని డిప్యూటీ సెక్ర‌ట‌రీగా ప‌దోన్న‌తి పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపొందే వ‌ర‌కు ఆమె కేంద్ర ప్ర‌భుత్వంలోనే ప‌ని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమె మ‌ళ్లీ తెలంగాణ‌లో అడుగుపెట్టారు. మొన్న‌టి వ‌ర‌కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న.. ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది ప్ర‌భుత్వం.