నేడు జమ్మూకశ్మీర్‌ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌షా

Union Home Minister Amit Shah

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్‌లో దాదాపు ప‌దేండ్ల త‌ర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం జమ్ము ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి సీనియర్‌ నేతలతో కలిసి షా ఇవాళ మధ్యాహ్నం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. మోడీ ప్రభుత్వ హయాంలో విద్య, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో జమ్మూ కశ్మీర్‌ ప్రాంతం తీవ్రవాద హాట్‌స్పాట్‌ నుంచి పర్యాటక హాట్‌స్పాట్‌గా రూపాంతరం చెందిందని తెలిపారు. తన రెండు రోజుల పర్యటన కోసం జమ్మూకు బయల్దేరి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఇవాళ బీజేపీ సంకల్ప్‌ పత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రేపు కార్యకర్తల సమ్మేళనం ఉంటుందని షా తెలిపారు.

కాగా, మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.