వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నారు – అమిత్ షా

,

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అమిత్‌షా… జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ చర్యతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నిజాంసేన, రజాకార్లను తరిమికొట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం తలవంచారని..13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని ఈ సందర్బంగా అమిత్ షా అన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందనే..వివిధ పేర్లతో కొందరు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని చురకలంటించారు. కానీ కేంద్రం ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్‌ 17న స్వాంతంత్ర్యం వచ్చిందన్నారు.