వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నాయకత్వం, ముఖ్యంగా నారా లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, అది ఫలితాలేమీ ఇవ్వలేదని ఆయన అన్నారు. పెట్టుబడులు రాబట్టడంలో పూర్తి విఫలమయ్యారని విమర్శించారు.
గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. నారా లోకేష్ రెడ్ బుక్ అంటే ఎవరికీ భయం కలిగించలేదని, వైసీపీ శ్రేణులు కేసుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలను అమలు చేయకుండా ఉండే పరిస్థితి వస్తే, ప్రజల తరఫున పోరాటం చేయడంలో వెనకడుగు వేయమని హెచ్చరించారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మినహాయించి టీడీపీ నేతలు ప్రకటించిన పథకాలు అమలు కాలేదని అంబటి విమర్శించారు. విజయసాయిరెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా నాయకత్వాన్ని అవమానపరచాలని టీడీపీ ప్రయత్నించిందని తెలిపారు. విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి తెచ్చిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రధానమంత్రి మోదీతో పాటు ఇతర ముఖ్యమంత్రులకు కూడా సలహాలు ఇచ్చే స్థాయిలో మాట్లాడటం వెర్రి తత్వమని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహాలు, అభూత కల్పనలకు మాత్రమే టీడీపీ పరిమితమైందని అంబటి విమర్శించారు.