ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డుకు అధికారిక ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాజధానిని చుట్టేసే అధునాతన రహదారి అందుబాటులోకి రానుంది. దీనివల్ల ట్రాఫిక్ భారం తగ్గడంతో పాటు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అనుసరించిన విధంగా, రాష్ట్ర అభివృద్ధికి పెరుగుదల కనిపించనుంది.

మొత్తం 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా
ఈ రహదారి 5 జిల్లాల పరిధిలోని (ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) మొత్తం 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా విస్తరించనుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత, ట్రాన్స్‌పోర్టేషన్ మరింత వేగవంతం అవడంతో పాటు, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది. రహదారి పనులను వేగంగా పూర్తిచేయడానికి ప్రభుత్వం త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. భూసేకరణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.
ORR పూర్తి అయితే, అమరావతి చుట్టుపక్కల ఉన్న పట్టణాల అభివృద్ధి
ఈ ప్రాజెక్ట్‌లో 2 ప్రధాన బ్రిడ్జిలు, 78 అండర్‌పాస్‌లు, 65 వంతెనలు నిర్మించనున్నారు. ప్రత్యేకంగా, రహదారికి అనుసంధానమైన మార్గాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ORR పూర్తి అయితే, అమరావతి చుట్టుపక్కల ఉన్న పట్టణాల అభివృద్ధికి మంచి ఊతమివ్వడమే కాకుండా, వ్యాపారం, పరిశ్రమలు, గృహ నిర్మాణ రంగం కొత్త దశలోకి ప్రవేశించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ అమలు రాష్ట్రాభివృద్ధికి ఒక గొప్ప ముందడుగుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.