హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏ-11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఇదే విషయంపై బన్నీ నిన్న తన లీగల్ టీమ్‌తో సమావేశమయ్యారు. నేడు విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వివాదానికి తావులేకుండా ఐకాన్ స్టార్ తన లాయర్‌తో కలిసి చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరవుతారని సమాచారం.
ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు.
ఇక, అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ టీమ్స్.. మోహరించాయి. అల్లు అర్జున్ ఇంటి దారిలో రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు.నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల అనంతరం తన లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ అయ్యారు. విచారణకు హాజరవ్వాలా..? సమయం కోరాలా..? అనే విషయంపై లీగల్ టీమ్‌తో చర్చలు చేశారట అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే రూపొందించిన ఒక వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.