ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. కొన్ని ఘటనలతో ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. ఇక నుంచి టోకెన్ లేని వారిని ప్రసాదాల ఆలయంలోకి అనుమతించమని సంస్థాన్ సీఈవో వెల్లడించారు.షిర్డీ సాయి సంస్థాన్ కొత్త నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ప్రధానంగా ప్రసాదాల ఆలయంలోకి ఎంట్రీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రసాదాలయంలోకి మద్యపానం, ధూమపానం, నేర ప్రవృత్తి ఉన్నవారిని అరికట్టేందుకు టోకెన్ వ్యవస్థను అమలు ప్రారంభించింది. షిర్డీలో నిత్యం దాదాపు 50 వేల మంది భక్తులు ఉచిత ప్రసాదం స్వీకరిస్తారు. ఈ ప్రసాదాలయం సాయి బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే, కొద్ది రోజులుగా ప్రసాదం స్వీకరణ కోసం వస్తున్న కొందరితో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, ట్రస్టు బోర్డు అక్కడకు వస్తున్న వారి పైన నిఘా పెట్టింది. కాగా, భక్తులు కాకుండా ఇతరులు వస్తున్నారని గుర్తించారు.

దీంతో, అటు వంటి వారికి ప్రవేశం లేకుండా టోకెన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. సాయిబాబా దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజన టోకెన్‌తో పాటు విభూది, బూందీ ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఒకవేళ దర్శనానికి ముందే భోజనం చేయాలనుకునే భక్తులకు ప్రసాదాల ఆలయంలో ఉచితంగా టోకెన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే రెండు ఆస్పత్రుల రోగులు, వారి కుటుంబీకులకు వసతి ఏర్పాట్లు చేస్తామని వివరించారు.కొద్ది రోజుల క్రితం షిర్డీ సాయి సంస్థాన్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హత్యకు గురయ్యారు.సంస్థాన్ అధికారులు అప్రమత్తం అయ్యారు.