జగన్ ధర్నాకు అఖిలేశ్ యాదవ్ సంఘీభావం

Akhilesh Yadav solidarity with Jagan dharna

న్యూఢిల్లీ: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ.. వైఎస్‌ జగన్ ఢిల్లీలో చేస్తోన్న దీక్షకు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు చంద్రబాబు సీఎంగా ఉండొచ్చు. రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు. ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. టీడీపీ ప్రభుత్వం అసలు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయపెట్టడం ద్వారా ప్రజాస్వామ్యంలో గెలవలేరు.

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం, బలగం. అలాంటి కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పోరాటాలు, కార్యకర్తల కృషితో ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారు. ప్రజలు మళ్లీ జగన్‌కు అధికారం కట్టబెడతారు. యూపీలో కూడా ఈ తరహా రాజకీయాలే నడుస్తున్నాయి. బుల్డోజర్‌ రాజకీయం నడుస్తోందక్కడ. వైఎస్‌ఆర్‌సీపీకి మా మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ టెర్రరిజాన్ని సహించం. రాజకీయ తీవ్రవాదంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో కలిసి పోరాడతాం. జగన్‌కు మద్దతుగా ఉంటాం. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలి.’ అని అఖిలేష్‌ ప్రసంగించారు.

వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన ధర్నాకు ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మద్దతు తెలిపింది. అనంతరం ఆ పార్టీ ఎంపీ వహాబ్‌ మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ టెర్రరిజాన్ని సహించం. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతో కలిసి రాజకీయ టెర్రరిజంపై పోరాడతాం. రాజకీయ టెర్రరిజాన్ని ఎదుర్కొవడంలో వైఎస్‌ జగన్‌కు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం’ అని అన్నారు. కాగా, ఏపీలో తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ అఖిలేశ్‌కు జగన్ వీడియోలు చూపించారు.