విమానాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎయిర్ బస్ మన దేశంలో హెలికాఫ్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం నేపథ్యంలో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో భాగస్వామ్యం చేసుకుని H125 హెలికాఫ్టర్ల ఉత్పత్తి చేయనుంది. ఇప్పటి వరకు మూడు దేశాల్లో ఈ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసిన ఎయిర్ బస్, నాలుగో ప్లాంట్‌గా భారత్‌ను ఎంపిక చేసుకుంది.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం స్థల పరిశీలనలు జరుగుతున్నాయి. 2024 నాటికి H125 హెలికాఫ్టర్ల అసెంబ్లీ ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ముందుకుసాగుతోంది. ప్రారంభ దశలో సంవత్సరానికి 10 హెలికాఫ్టర్లను ఉత్పత్తి చేస్తూ, ఆర్డర్ల పెరుగుదలతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇది ప్రైవేట్ రంగంలో భారతదేశంలో తొలి సివిల్ హెలికాఫ్టర్ తయారీ ప్లాంట్ అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
H125 హెలికాఫ్టర్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడుతుంది. 2.8 టన్నుల బరువు కలిగిన ఈ హెలికాఫ్టర్ ఆరుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు. 23,000 అడుగుల ఎత్తులో ఎగరగల సామర్థ్యం, 630 కిలోమీటర్ల పరిధి, 250 కిలోమీటర్ల వేగంతో ఇది విపత్తు నిర్వహణ, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలు, చట్ట అమలు, వాణిజ్య రవాణా వంటి విభాగాలకు సరిపోతుంది. దక్షిణాసియా మార్కెట్లో రాబోయే 20 సంవత్సరాల్లో ఈ తరహా హెలికాఫ్టర్లకు భారీ డిమాండ్ ఉంటుందని ఎయిర్ బస్ అంచనా వేస్తోంది.
ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే విషయంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ఏపీ ప్రభుత్వం రాయలసీమను ప్రధానంగా ప్రోత్సహిస్తోంది. కియా మోటార్స్ పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటు చేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, విద్యుత్, నీరు, రవాణా వంటి మౌలిక వసతులు ఏపీలో ఉన్నాయని అగ్రగామిగా చూపిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి కొత్త రాష్ట్రంగా ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో, ఏపీ ఈ అవకాశాన్ని పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. టాటాలతో కలిసి పనిచేయనున్న ఎయిర్ బస్, భారత్‌లో హెలికాఫ్టర్ల తయారీ రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఇది భారత్‌లో ఎయిర్ బస్ కోసం ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.