న్యాయం దక్కేవరకు ఆందోళనలు ఆపేది లేదు: కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు

Agitation will not stop until justice is served: Kolkata junior doctors

కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్‌ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. తమది ప్రజా ఉద్యమమని.. దీనిని ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ మరచిపోకూడదని వెల్లడించారు. ఆందోళనలు చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం సోమవారం హెచ్చరించింది. ఏ నిరసనైనా, ఆందోళనైనా.. విధులను విస్మరించి చేయడం సరికాదు. తక్షణమే విధుల్లోకి చేరాలి. రోగులకు సేవలందించాలి. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మాకు తెలుసు. మీ భద్రతకు పూచీగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉంటారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధులకు హాజరైన వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవు. కొనసాగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ధర్మాసనం స్పష్టం చేసింది.

దీనిపై స్పందించిన జూనియర్‌ డాక్టర్లు.. సుప్రీంకోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందన్నారు. కేసును హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, పశ్చిమ బెంగాల్‌ పోలీసుల నుంచి సీబీఐకీ బదిలీ చేశారు. అయినా ఇప్పటికీ న్యాయం దక్కలేదని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని రాష్ట్రం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. ఆందోళనల కారణంగా రాష్ట్రంలో వైద్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, సకాలంలో వైద్యం అందక 23 మంది ప్రాణాలు కోల్పోయారని, చికిత్స అందక 6 లక్షల మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం పూర్తిగా అబద్ధమని తెలిపారు. తమకు న్యాయం లభించేవరకు నిరసన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా, గత నెల 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వైద్యుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోతున్నది. కాగా, ఈ సంఘటనను సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.