ఈ నెల 13వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆరంభమైన మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. కాగా- మహా కుంభ మేళాకు వచ్చే 50 లక్షల మంది భక్తుల ఆకలిని తీర్చడానికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని రంగంలోకి దిగారు. ఇస్కాన్ సహకారంతో మహా కుంభ మేళాలో ప్రత్యేకంగా మహా ప్రసాద సేవ అన్న వితరణ కార్యక్రమాన్ని కొద్దిసేపటి కిందటే ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇస్కాన్ ప్రతినిధి గురు ప్రసాద్ స్వామీజీ ఇందులో పాల్గొన్నారు.
మహా కుంభ మేళా ముగిసేంత వరకు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకూ అన్న ప్రసాద వితరణ కొనసాగుతుంది. మహాప్రసాద సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ ఉదయమే కుటుంబ సభ్యులతో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు గౌతమ్ అదాని. ఇస్కాన్ క్యాంప్‌లో అన్న వితరణ సేవలో పాల్గొన్నారు.

45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. పవిత్ర స్నానాలను ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ రంగంలోకి దిగింది. దేశం నలుమూలల నుంచీ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచీ ఆయా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటోన్నాయి.
దీనికోసం ప్రత్యేకంగా రెండు వంటగదులను ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమం, స్నాన ఘట్టాలు.. వంటి వేర్వేరు ప్రాంతాల్లోమొత్తం 40 చోట్ల మహాప్రసాద అన్న వితరణ సేవ శిబిరాలను నెలకొల్పారు. వృద్ధులు, దివ్యాంగులు, పాలిచ్చే తల్లుల కోసం ఆయా శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికోసం గోల్ఫ్ కార్ట్‌లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్న వితరణ సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తోన్నందుకు ఇస్కాన్ ప్రతినిధులను ప్రశంసించారు అదాని.