హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ఓ సినిమా ఈవెంట్లో కుమార్తె గురించి ఆసక్తికర వియాలు చెప్పారు. అమ్మ లేని వారు.. కూతురిలోవారి అమ్మను చూసుకుంటారని.. తన పదేళ్ల వయసులో తన తల్లి చనిపోయారని ఎమోషనల్ అయ్యారు. తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకున్నానని.. కానీ తనకు కూతురితో మాటలు లేవని చెప్పుకొచ్చారు. తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్నారు.
గత నెలలో రాజేంద్రప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరభద్రస్వామి ఔషధ నియంత్రణ మండలి కార్యాలయంలో ఉద్యోగి కాగా.. విజయవాడలోని రామవరప్పాడు దగ్గర బైక్‌లో పెట్రోల్ పోయించుకుని వెళ్తున్న ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరభద్రస్వామికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.. వారిద్దరూ కెనడాలో స్థిరపడ్డారు.