టీడీపీ ఆఫీస్ దాడి కేసులో నిందితుల అరెస్ట్

మంగళగిరిలో మూడేళ్ల క్రితం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటాకా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను సేకరించారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకొని పనిలో పడ్డారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, పోలీసులు గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన దాదాపు 200 మంది అల్లరి మూకలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్లు, ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్ డ్యామేజ్ అయ్యింది. టీడీపీ ఆఫీసు వద్ద కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు పోలీసుల విచారణలో బాధ్యతులను తేల్చనున్నారు.