నేడు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనున్న ఆప్‌..!

AAP will announce the new Chief Minister of Delhi today..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటనతో దేశరాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఈరోజు సాయంత్రం కేజ్రీ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడే అవకాశం ఉంది. పార్టీ శాసనసభ సమావేశం తర్వాత నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ఆప్‌ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో చర్చించి ఢిల్లీ తదుపరి సీఎంను ఖరారు చేయనున్నారు. అనంతరం కొత్త సీఎం పేరును ప్రకటించనున్నట్లు ఆప్‌ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా నివేదించింది.

అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్‌ను కోరగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సమయం ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్‌ ఎల్జీని కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. కాగా, సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్‌ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుపై కొందరు నేతలతో ముఖాముఖీ సమావేశమయ్యారు.

ఇదే సమయంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అతిశీ. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ బాధ్యతలను చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా చూస్తున్నారు. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిశీ నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్ పర్సన్‌గానూ పనిచేశారు.

అతిశీతోపాటు సౌరభ్‌ భరద్వాజ్‌, కైలాశ్‌ గెహ్లాట్‌, గోపాల్‌ రాయ్‌, ఎంపీ రాఘవ్‌ చద్ధా పేర్లను ఆప్‌ పరిశీలిస్తున్నట్టు మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక మనీశ్‌ సిసోడియా.. కేజ్రీవాల్‌ బాటలోనే పయనిస్తున్నారు. ప్రజలు తన నిజాయితీని ఆమోదిస్తే మాత్రమే తాను కూడా మళ్లీ ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వస్తానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.