కేజ్రీవాల్‌కు బెయిల్‌ పై ఆప్‌ నేతలు హర్షం

AAP leaders are happy about Kejriwal's bail
AAP leaders are happy about Kejriwal’s bail

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆయనకు ఎట్టకేలకు ఊరట లభించింది. సీబీఐ కేసులో ఆప్‌ చీఫ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన కేజ్రీ.. సుప్రీం తీర్పుతో బయటకు రాబోతున్నారు. ఇక తమ సుప్రిమోకు బెయిల్‌ లభించడంపై ఆప్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సత్యమే గెలిచిందంటూ .. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి గెలిచేసి న్యాయమే. ఢిల్లీ బిడ్డ అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైలు సంకెళ్ల నుంచి విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం’ అంటూ ఆప్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన అవినీతి కేసులో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.