ఢిల్లీలో ఇంటింటి ప్రచారం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ కాన్వాయ్‌పై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనతో ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కేజీవాల్ ప్రచారానికి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ దాడికి భాజపా నేతలు బాధ్యత వహించాలంటూ ఆప్ మండిపడింది. “ఓటమి భయంతో భాజపా ఇటువంటి దాడులకు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ. కేజీవాల్‌ను అడ్డుకోవడమే వారి ఉద్దేశం” అని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ అనుచరులే ఈ దాడికి కారణమని ఆప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది.
ఘటనపై ఆప్ అధికారికంగా స్పందించింది. “మీ దాడులకు మేం భయపడేది లేదు. రాళ్లు, ఇటుకలతో మా ప్రచారాన్ని నిలిపివేయలేరు. ప్రజలు ఎన్నికల ద్వారా మీకు తగిన బుద్ధి చెబుతారు” అంటూ ఆ పార్టీ ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించింది. భాజపా ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఇది తమకు సంబంధం లేనిదని తెలిపింది. రాళ్ల దాడి తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాన్వాయ్‌ను కాపాడేందుకు చర్యలు చేపట్టడంతో ఎలాంటి పెద్ద ప్రాణాపాయం జరగలేదు. అయితే ఈ దాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆప్ డిమాండ్ చేసింది. కేజీవాల్‌కు పకడ్బందీగా భద్రత కల్పించాలని కోరింది.
ఈ దాడి ఎన్నికల సమరానికి మరింత వేడిని తెచ్చింది. భాజపా, ఆప్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు తప్పనిసరిగా నిందించబడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ఎన్నికల ఫలితాలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.