లక్నో: ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్‌లో పుణ్యసాన్నాలు చేసేందుకు వెళ్తున్న భక్తులు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రయాగ్‌రాజ్-మీర్జాపూర్ హైవేపై ఉన్న మీజా ఏరియా వద్ద బొలెరో వాహనం బస్సును ఢీకొన్నది.

చత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లా నుంచి భక్తులు సంగం స్నానాల కోసం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నుంచి వస్తున్న బస్సును.. బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదం పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ వారం ఆరంభంలోనే హైదరాబాద్ నుంచి వెళ్లిన ఏడుగురు భక్తులు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలో ఓ ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో హైదరాబాదీ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళాలో జనవరి 29వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందగా, 25 మందిని గుర్తించినట్లు పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు. ఆ తొక్కిసలాటలో 60 మంది గాయపడ్డారు. జనవరి 13వ తేదీన మొదలైన మహాకుంభ్.. ఫిబ్రవరి 26వ తేదీన ముగియనున్నది.