నెట్టంపాడు ఫేజ్-1 పంపులో తలెత్తిన సాంకేతిక సమస్య

నెట్టంపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న జూరాల నుంచి నీటిని ఎత్తిపోసే ఫేజ్-1 పంపులు సాంకేతిక సమస్యతో రాత్రి నుంచి ఆగిపోయాయి. పంపులకు అందించే కీలక సర్క్యూట్‌లో స్టాటికల్ ఫ్రీక్వెన్సీ కంపోనెంట్ (ఎస్‌ఎఫ్‌సీ) సమస్య కారణంగా నీటి ఎత్తిపోసే పంపులు రాత్రి నుండి ఆగిపోయాయి. సాంకేతిక సమస్యను నెట్టంపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న పంపులను బీహెచ్‌ఈఎల్ కంపెనీ మాత్రమే సరిద్డేందుకు అవకాశం ఉంది. కాగా, ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కింద రూ.1.13 కోట్లు బాకీ పడింది. బీహెచ్‌ఈఎల్‌కు ఇంత వరకు మెయిన్‌టెనెన్స్ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బకాయిలను స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే విషయంపై ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడితే.. నెట్టంపాడు ఫేజ్-1 కింద ఉన్న పంపింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాదాపు 750 క్యూసెక్కులను పంపింగ్ చేసే పంపు ఆగిపోయింది. ఈ క్రమంలో జరిగిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. బీహెచ్‌ఈఎల్ కంపెనీతో మాట్లాడామని వాటిని సరిద్డేందుకు త్వరలోనే చర్యలు చేపడుతామని తెలిపారు.