బీహార్‌ సీఎంకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

A setback for Nitish in the Supreme Court

న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును గతంలో పట్నా హైకోర్టు రద్దు చేసింది. కాగా ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బిహార్‌ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా ఈ ఉత్తర్వులపై విచారణ జరిపిన సుప్రీం స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

నీతీశ్ సర్కారు గతేడాది నవంబరులో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతున్నట్టు అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టింది. దాంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 65 శాతానికి పెరిగాయి. అయితే, ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జూన్‌ 20న 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కాగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ బిహార్‌ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.