అరుదైన అల్బినో జింక తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఒక అడవి దగ్గర మంచులో అరుదైన తెల్లటి జింక (అల్బినో జింక) నిలబడి ఉండటం చూసిన ఓ మహిళ దాన్ని తన కెమెరాలో బంధించింది. అనంతరం ఆ వీడియోను ఆమె మొదట ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ తర్వాత ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసింది.

“ఈ జింక గులాబీ రంగు కళ్లను బట్టి నిజమైన అల్బినో అని చెప్పగలం. ఆ సుందర మనోహార దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం” అని ఆమె టిక్‌టాక్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. అయితే, ఆమె ఈ అరుదైన జింకను ఎక్కడ చూసింది మాత్రం చెప్పలేదు.
ఇక అల్బినో జింకలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రతి లక్ష జింక జననాలలో ఒకటి మాత్రమే ఇలా శ్వేత వర్ణంతో ఉంటుందట. నిజమైన అల్బినో జింకలకు మెలనిన్ పూర్తిగా ఉండదు. ఫలితంగా స్వచ్ఛమైన తెల్లటి బొచ్చు, విలక్షణమైన గులాబీ కళ్లు ఉంటాయి. కాగా, 2023లో కర్ణాటకలోని కాబిని అడవిలో వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ ధ్రువ్ పాటిల్ ఇలాగే ఒక అరుదైన అల్బినో జింకను ఫోటో తీశారు.