ఉచితాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే – కేటీఆర్

ktr comments on congress govt

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి KTR స్పందించారు. ‘ఏదైనా ఉచితంగా ఇస్తామని అంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లే. ఉచితాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదు’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనున్నది. రాష్ట్రంలో త్వరలో బస్సు చార్జీలు భారీ స్థాయిలో పెరుగనున్నాయి. ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌ ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ‘రెండు రోజుల క్రితం మా బోర్డు సమావేశం జరిగింది. బస్సు చార్జీలను 15-20 పెంచాలని మేం ప్రతిపాదనలు పంపాం. మిగతాది సీఎం సిద్ధరామయ్య విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కేఎస్‌ఆర్టీసీ మనుగడ సాగించాలంటే, చార్జీల పెంపు తప్పనిసరి’ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నది. వివిధ రకాల పన్నులు, ఇతరత్రా రూపాల్లో సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్నది. ఇప్పటికే గైడెన్స్‌ వ్యాల్యూ ట్యాక్స్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్‌, ఈవీలపై లైఫ్‌ టైమ్‌ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గత నెలలో పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. ఇక తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరించడం ఖాయమని కేటీఆర్ ఆరోపించారు.