మాజీ సీఎం జగన్‌ పై కేసు నమోదు

A case has been registered against former CM Jagan

అమరావతిః మాజీ సీఎం జగన్ పై కేసు నమోదయింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ కేసులో జగన్ ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

2021 మే 14న జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు. జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కస్టడీలో తనను హింసించారని… తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి యత్నించారని తెలిపారు. ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు.