తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రైతుల అభివృద్ధికి దోహదపడేలా రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకాన్ని (Indira Soura Giri Jala vikasam) అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం లేని పోడు భూములకు సౌరశక్తి ఆధారిత పంపుసెట్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించనున్నారు. దీని ద్వారా సుమారు 6 లక్షల ఎకరాల పొలాలకు లాభం చేకూరనుంది.
గిరిజన రైతుల కోసం ఈ పథకం
ఈ పథకం ప్రత్యేకంగా RoFR (అటవీ హక్కుల చట్టం – 2006) ప్రకారం భూములు కలిగి ఉన్న గిరిజన రైతుల కోసం రూపొందించబడింది. ఆయా రైతులకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపుసెట్లు మంజూరు చేయనుంది. ఒక్క రైతు వద్ద 2.5 ఎకరాల లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉంటే అతనికి ప్రత్యేకంగా ఒక యూనిట్ కేటాయిస్తారు. 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సమూహంగా ఇతర రైతులతో కలిపి యూనిట్ ఇస్తారు. ఈ విధంగా గిరిజనుల సాగుకు శాశ్వత నీటి వనరులు ఏర్పడేలా చేస్తోంది ప్రభుత్వం.
రూ.6 లక్షల లోపు వ్యయం
ప్రతి యూనిట్‌కు గరిష్టంగా రూ.6 లక్షల లోపు వ్యయం చేయనున్నారు. సూర్య శక్తిని వినియోగించి నీటి పంపకాన్ని నిర్వహించడం వల్ల, ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా, శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ పథకం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ పథకం విజయవంతమవుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also : Kaleshwar Temple : పుష్కరాలకు పోటెత్తిన భక్తులు