ఏ వయసు వారైనా సరే చాలా మంది సర్దుకుపోలేని విషయం అధిక బరువు. అయితే ఎంత వద్దనుకున్నా నాలుగు పదుల వయసు దాటాక చాలా మంది మహిళలు క్రమంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు శరీరంలో జరిగే మార్పులతో పాటు జీవనశైలి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ప్రధాన కారణం. మరి, ఈ సమస్యను అధిగమించి 40 ఏళ్లు వయస్సులో కూడా ఫిట్‌గా ఉండడం సాధ్యపడదా? అని చాలా మందికి వచ్చే సందేహం. అది మీ చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు.
స్వీట్లు ఎక్కువగా తినడం
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే బరువు అదుపులో ఉండాలని నిపుణులు అంటున్నారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ శక్తి క్షీణించడం వల్ల ఏ పని పైనా దృష్టి పెట్టలేకపోవడంతో వ్యాయామమూ చేయలేరని చెబుతున్నారు. మరోవైపు జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుందని చెబుతున్నారు. ఇది క్రమంగా తీపి తినాలన్న కోరికను పెంచుతుందట. దీంతో శరీరానికి శ్రమ లేక, అనారోగ్యపూరిత ఆహారానికి అలవాటు పడడం వల్ల క్రమంగా బరువెక్కుతారని సూచిస్తున్నారు.
40 ఏళ్లలో జీవక్రియల పనితీరు నెమ్మదించడం వల్ల శరీరంలో చేరిన క్యాలరీలు, కొవ్వులు కరగడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సమస్య అనేది అధిక బరువుకు దారితీస్తుందంటున్నారు. ఈ వయస్సులో మెనోపాజ్‌కు చేరువవడం, లేదంటే అప్పటికే ఈ దశలోకి ప్రవేశించడం వల్ల టెస్టోస్టిరాన్, ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయిల్లో మార్పుల కారణంగా అధిక బరువుకు దారితీస్తుందని పేర్కొన్నారు.

శరీర స్థాయిలో మార్పులు
వయసు పెరిగే కొద్దీ కండరాలు, ఎముకల సామర్థ్యం తగ్గడం వల్ల ఎక్సర్ సైజ్ చేయడానికి బాడీ సహకరించదు. ఒకవేళ బలవంతంగా చేసిన గాయాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారని చెబుతున్నారు. దీంతోపాటు మెనోపాజ్‌కు చేరువయ్యే కొద్దీ వేడి ఆవిర్లు, అర్ధరాత్రి ఉన్నట్లుండి చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో రాత్రిళ్లు నిద్రకు దూరం అవ్వడంతో పాటు ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతాయని వివరించారు. జీవనశైలి అదుపు తప్పడం వల్ల కూడా బరువు పెరిగిపోతారని వివరిస్తున్నాయి.
వ్యాయామం ముఖ్యం
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వయసు పెరుగుతున్నా వర్కవుట్ చేయడం మానకూడదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో స్క్వాట్స్, పుషప్స్, లాంజెస్ కెటిల్‌బెల్‌తో ఎక్సర్సైజ్ వంటివి రోజూ సాధన చేయాలని వివరించారు. ఒకవేళ ఒంటరిగా చేయడం ఇబ్బందిగా ఉంటే జిమ్‌లో చేరవచ్చనని సలహా ఇస్తున్నారు.
హెల్త్ చెకప్ అవసరం
సరైన నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతోపాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. కాబట్టి రోజూ రాత్రుళ్లు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవడం మంచిదని చెబుతున్నారు. విటమిన్ల లోపాలు కూడా శారీరక సత్తువను కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు.
Read Also: Anger Heart: అధిక కోపం గుండెకు హానికరమా? నిపుణులు ఏమంటున్నారంటే?