పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పటికీ బలూచ్ తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉంది. ఇప్పటివరకు 150 మందికి పైగా బందీలను పాకిస్థాన్ సైన్యం విడిపించగా.. 100 మందికి పైగా బందీలు ఇప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులోనే ఉన్నారు. ఇంతలో మొత్తం రైలు దాడి కాలక్రమాన్ని తెలియజేసే వీడియోను బలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. బీఎల్ఏ(బలూచ్ లిబరేషన్ ఆర్మీ) విడుదల చేసి ఈ వీడియోలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ కదులుతున్నట్లు కనిపించింది. ఇంతలోనే రైలును లక్ష్యంగా చేసుకుని ముందుగా పేలుడు జరుగుతుంది.
వీడియోలో బందీలను బయటకు తీసుకుని వస్తున్న దృశ్యాలు
ఈ పేలుడు తర్వాత రైలు ఆగుతుంది. ఈ వీడియోలో బలూచ్ తిరుగుబాటుదారులు కూడా కనిపిస్తారు. కొండలపై కూర్చుని రైలు కోసం వేచి చూస్తూ ఉన్నారు. రైలు ప్రయాణికులను బందీలుగా తీసుకుని బయటకు తీసుకువస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వారు కొండల మధ్య తుపాకీ గురిపెట్టి కూర్చుని కనిపించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా దాడి చేసింది? మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ లోని క్వెట్టా నుంచి జాఫర్ ఎక్స్‌ప్రెస్ పెషావర్ కు బయలుదేరింది. ఈ రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు సిబ్బికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఈ దాడి బోలాన్ లోని మష్పాక్ టన్నెల్ లో జరిగింది. రైలు వెళ్తున్న ప్రదేశం ఒక కొండ ప్రాంతం. అక్కడ 17 సొరంగాలు ఉన్నాయి. దీని కారణంగా రైలు వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ మష్పాక్ లోని సొరంగం-8ని పేల్చివేసింది. దీని కారణంగా రైలు పట్టాలు తప్పి హైజాక్ చేయబడింది.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి ప్రణాళికతో ..
ఈ దాడిని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి ప్రణాళికతో నిర్వహించింది. బలూచ్ తిరుగుబాటుదారులు అప్పటికే వేచి ఉన్నారు. ఈ దాడి కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన అత్యంత ప్రాణాంతక యోధులైన మజీద్ బ్రిగేడ్, ఫతేలను సిద్ధం చేసింది. పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ కారణంగా ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. మష్పాక్ టన్నెల్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఈ సొరంగం క్వెట్టా నుంటి 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సొరంగం ఉన్న ప్రాంతం చాలా కఠినమైన కొండ ప్రాంతం. హైజాక్ చేయబడిన రైలు ప్రస్తుతం బోలాన్ పాస్ వద్ద నిలిచి ఉంది. ఈ ప్రాంతమంతా కొండలు, సొరంగాలతో చుట్టుముట్టబడి ఉండటం వల్ల మొబైల్ నెట్ వర్క్ లేదు. దీని కారణంగా రెస్క్యూ ఆపరేషన్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.