72 రైళ్లు రద్దు..పలు రైళ్లు దారి మళ్లింపు : ఇండియన్ రైల్వే

moving migrant workers to jharkhand in train
72 trains cancelled..many trains diverted : Indian Railways

న్యూఢిల్లీ: రైలు ప్రయాణాలు చేసే వారికి ఇండియన్ రైల్వేస్ అలర్ట్ జారీ చేసింది. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. డిపార్ట్ మెంట్ మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 4వ తేది నుంచి 20వ తేదివరకు ఉండనుంది. వీటితోపాటు మరో 22 రైళ్ల రూట్ కూడా మార్చినట్లు ఇండియన్ రైల్వే అధికారులు పేర్కొన్నారు.

రాజ్‌నంద్‌గావ్, నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ ట్రాక్‌ నిర్మాణం కోసం భారత రైల్వే దాదాపు రూ.3,540 కోట్లు ఖర్చు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్-కలమ్ స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుచర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాజ్‌నంద్‌గావ్, నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కిలోమీటర్ల మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా ఈ మార్గాల్లో ప్రయాణించే దాదాపు 100 రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైల్వే శాఖ అధికారులు వివరించారు. ఇందులో సుమారు 72 రైళ్లు రద్దు చేయగా, 22 రైళ్ల రూట్ మార్చినట్లు ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు.

వీటితోపాటు మరో ఆరు రైళ్ల మార్గాన్ని కుదించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఈనెలలో స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగ, వరలక్ష్మి వ్రతం వంటి పండుగలు ఉండడం వరుస సెలవులు ఉన్నాయి. దీంతో పలు రైళ్లు రద్దవ్వడంతో ప్రయాణఙకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.