బెంగాల్‌ రాష్ట్ర సచివాలయం ముట్టడికి విద్యార్థుల పిలుపు..మూడంచెల భద్రత

6000-cops-three-layer-security-kolkata-turns-fortress-for-protest-march

కోల్‌కతా: కోల్‌కతా లోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్‌కతా సహా అన్ని నగరాల్లో వైద్యులు, విద్యార్థి సంఘాలు నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

విద్యార్థుల నిరసన నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. హౌరాలోని రాష్ట్ర సచివాలయం “నబన్న అభిజన్” పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 6,000 మందికిపైగా పోలీసులు నగర వ్యాప్తంగా మోహరించారు. ఐజీ, డీఐజీ స్థాయిలోని 21 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక భద్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, హౌరా సిటీ పోలీసులతోపాటు భారీ రేడియో ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లు, డ్రోన్‌లు, వాటర్‌ ఫిరంగులను ఆ ప్రాంతంలో మోహరించారు. అదేవిధంగా నబన్న పరిసరాల్లో 19 పాయింట్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇతర కీలక ప్రదేశాల్లోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు.