మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం

5 lakh financial assistance to the families of the deceased

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తం కావాలన్నారు. కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేయాలన్నారు. అత్యవసర సేవల కోసం 8 పోలీస్‌ బెటాలియన్లకు ఎన్డీఆర్‌ఎఫ్‌ తరహా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని, జాతీయ విపత్తుగా పరిగణనించి తక్షణ సాయానికై కేంద్రానికి లేఖ రాయాలన్నారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు తక్షణ సహాయం కింద రూ. 5 కోట్లు కేటాయించారు. వరద మృతుల కుటుంబాలకు పరిహారంపై రేవంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.4 లక్షల పరిహారం ఇస్తుండగా.. దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. వరద నష్టంపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు. హైదరాబాద్‌లో వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.