బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా కార్య క్రమం మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు, తమ ధర్నాతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు నల్గొండలో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ సహా కీలక నేతలు పాల్గొనాల్సి ఉంది. పండుగ తర్వాత కొత్త తేదీని ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతు భరోసా కుదింపుపై ఉమ్మడి నల్గగొండ జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్దిరోజులుగా ఆగ్రహంతో రోడ్లపైకి వస్తున్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్‌తో ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ రైతు మహాధర్నాకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ ప్రకటించింది, కానీ ప్రస్తుతం సంక్రాంతి సందర్బంగా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ధర్నా చేపడితే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి వాయిదా వేసింది.