న్యూఢిల్లీ: అమెరికా డాలరుతో రూపాయి మారకం విడుదల దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వాన్ని శనివారంనాడు నిలదీశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని అన్నారు. రూపాయి విలువ శుక్రవారంనాడు 18 పైసలు పడిపోయి చరిత్రలోనే తొలిసారి 86.04కు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశ చరిత్రలోనే మొదటిసారి రూపాయి విలువ 86.04కు చేరింది.
అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు డాలరు మారకం విలువ 58-59గా ఉండేది. ఆ సమయంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ ప్రతిష్టతో రూపాయి విలువను ఆయన ముడిపెట్టేవారు. ఏ దేశ కరెన్సీ కూడా ఇంతలా పడిపోడదని, అంతా తనకే తెలుసునని ఆయన చెప్పేవారు. ఈరోజు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. దీనిపై దేశ ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి అని ప్రియాంక గాంధీ అన్నారు.
కాగా, విదేశీ క్రూడాయిల్ ధరలు పెరగడం, దేశవాళీ ఈక్విటీ మార్కెట్‌లో నెగిటివ్ సెంటిమెట్ ప్రభావం రూపాయి పతనంపై ప్రభావం చూపించిందని ఫోరెక్స్ ట్రేడర్స్ చెబుతున్నారు. డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా కొత్త ప్రభుత్వ పగ్గాలు చేపట్టనుండటంతో యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ఆంక్షలతో కూడిన వాణిజ్య చర్యలు తీసుకోనుందనే ఊహాగానాల నేపథ్యంలో డిమాండ్ పెరిగి డాలర్ బలపడిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.