జిల్లా కలెక్టర్లతో సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి పథకాన్ని అమలు చేసే తీరును సమీక్షించాలని, ప్రభుత్వం నిష్క్రమంగా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత కలెక్టర్లదే అని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం కనపడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రెండో స్థాయి అధికారులు కూడా హాస్టల్స్‌కి వెళ్లి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలను అందించాలని సీఎం ఆదేశించారు. విద్యార్థులు నైతిక విలువలతో కూడిన పౌరులుగా ఎదగడానికి అవసరమైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అధికారులు ప్రజలతో మమేకమవడం, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా పరిపాలనలో పారదర్శకత సాధ్యమవుతుందని రేవంత్ నొక్కి చెప్పారు.
ఇక జనవరి 26 తర్వాత జిల్లాల్లో స్వయంగా పర్యటిస్తానని సీఎం ప్రకటించారు. ఈ పర్యటనల్లో నిర్లక్ష్యం కనపడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి అధికారి సమర్ధంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతున్నాయా అని స్వయంగా సమీక్షిస్తానని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచిస్తూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలను అందించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే విధానంలో అధికార యంత్రాంగం పనిచేయాలని, తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించారు. ముఖ్యంగా, IAS, IPS అధికారులు తమ బాధ్యతలను మరింత చురుకుగా నిర్వర్తించాలన్నారు. నెలలో కనీసం ఒక్కసారైనా హాస్టల్స్‌ను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని, విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.