ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముంగేలీ జిల్లాలోని ఓ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. సైలో – బల్క్ మెటీరియల్‌లను నిల్వ చేయడానికి ఉపయోగించే ఇనుప నిర్మాణం – క్రాష్ అయ్యింది. సైట్‌లో ఉన్న కొంతమంది కార్మికులు దాని కింద చిక్కుకున్నారని ఆయన చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. ముంగేలి కలెక్టర్ రాహుల్ డియో మాట్లాడుతూ.. ముంగేలిలోని సర్గావ్‌లోని ఇనుము తయారీ కర్మాగారంలో కర్మాగారం చిమ్నీలు కూలిపోవడంతో కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో పోలీసులు, అధికారులు ఉన్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
పదుల సంఖ్యలో గాయపడిన కార్మికులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరాగావ్‌లోని కుసుమ్ ప్లాంట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన ప్రకారం.. కనీసం 8-9 మంది కార్మికులు చనిపోయారని, మరికొందరు గాయపడినట్లు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు అత్యవసర సేవలు, రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. సరాగావ్ ప్రాంతంలో ఉన్న ప్లాంట్‌లో మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని ముంగేలీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భోజ్‌రామ్ పటేల్ తెలిపారు.