హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మణికొండలోని నెక్నాంపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపటడ్డంతో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా బృందం శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ తెలిపారు.
కాగా, గండిపేట జలాశయం దిగువన నార్సింగిలో రాజపుష్ప సంస్థ నది పక్కన నిర్మాణ పనులు చేపట్టింది. ఈ క్రమంలో సదరు సంస్థ నదిని ఆక్రమిస్తున్నదని హైడ్రాకు ఫిర్యాదు వెళ్లింది. కమిషనర్ రంగనాథ్ రెండు వారాల కిందట క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూసీ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. నది 40 అడుగుల పొడవున ఆక్రమణకు గురైందని, ఆ ప్రాంతంలో 30 అడుగుల ఎత్తున మట్టి నింపారని తేలింది. అదే రోజున ఆయన ఆక్రమణపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.
తప్పును సరిదిద్దాలని నిర్మాణ సంస్థకు సూచించారు. ఆ మేరకు వ్యర్థాల తొలిగింపు జరుగుతున్నట్లు హైడ్రా గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. వరుస తనిఖీలు, విచారణ కార్యక్రమాలతో నెక్నాంపూర్ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను పూజ హోమ్స్ సంస్థ తొలిగించినట్లు వెల్లడించింది. శంషాబాద్ గొల్లవారికుంటలోని అక్రమ లేఅవుట్‌పై విచారణ కొనసాగుతున్నదని, త్వరలోనే చర్యలుంటాయాని గుర్తు చేసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయని నిన్ననే హైడ్రా ఓ ప్రకటనలో తెలిపింది. నేడు ఆ మేరకు చర్యలు చేపట్టడం గమనార్హం.