ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు అధికం అవుతున్నాయి . తాజాగా సినిమా నటి హనీ రోజ్ ని లైంగికంగా వేధించిన కేసులో కేరళ కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్ అరెస్టయ్యారు. నటి ఫిర్యాదు అనంతరం కేరళ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బుధవారం మధ్యాహ్నం బాబీ చెమ్మనూర్‌ను కస్టడీలోకి తీసుకుంది.
హనీరోజ్ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ వాయనాడ్‌లో ఆయనను అరెస్ట్ చేశారు. వ్యాపారి చెమ్మనూర్ అరెస్టుపై నటి హనీరోజ్ స్పందించారు. ఇది తనకు ఎంతో ప్రశాంతమైన రోజని అన్నారు. తాను ఈ విషయాన్ని సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లగానే వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
2012లో వచ్చిన త్రివేండ్రమ్ లాడ్జి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన హనీరోజ్.. ఇలాంటి మతిలేని మనుషుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని, అయితే చెమ్మనూర్ మళ్లీమళ్లీ లైంగికంగా వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. నాలుగు నెలల క్రితం ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. దాంతో తన కుటుంబం అంతా ఆవేదన చెందినదని చెప్పారు.