అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నాం. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని భావిస్తున్నాం.
జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టాం. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ప్రవేశపెట్టారు. విద్యావేత్తల నుంచి, ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి విలువైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం. సైన్స్, ఆర్ట్స్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా నిర్ణయాలతో పాటు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఇది జాతీయ స్థాయిలో సమన్వయాన్ని పెంచుతుందని, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ప్రగతిపై సానుకూల ప్రభావం చూపుతుందా లేదా అన్నది భవిష్యత్‌లో తెలుస్తుంది.