ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా బాగుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు పాలన బాగుందని..మంచి పరిపాలన దక్షుడని.. విజనరీ ఉన్న నేతని… సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మేధావులలోనూ, విద్యావేత్తలలో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే… కరిగిపోయే మనస్సున్న నేత పవన్ కల్యాణ్ అని ఆర్ కృష్ణయ్య అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని, ప్రధానికి నీరాజనం పట్టడానికి విశాఖ ప్రజలు సిద్దం అయ్యారన్నారు. విశాఖ ప్రాంతం అభివృద్దికి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్నిరంగాలలో గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందన్నారు.
ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.