తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పులో ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోమని పేర్కొంది. అయితే కేటీఆర్ తరపు న్యాయవాది అరెస్ట్ నుంచి రక్షణ కోరగా, ఆ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేసిన తప్పు ఆలస్యం అయినా బయటపడుతుందన్నారు. తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందో అందరికీ అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌పై తమకు వ్యతిరేకత లేదని స్పష్టం చేసిన పొంగులేటి, “బీఆర్ఎస్ నాయకులు మా టార్గెట్ కాదు. కోర్టులు తప్పులు, ఒప్పులను నిర్ధారిస్తాయి. ఆ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేం” అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే ఆ విచారణ ప్రక్రియనే నమ్మాలని సూచించారు.
తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం, ఈ కేసు మరోసారి రాజకీయ చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అయితే, కోర్టు తీర్పు ప్రకారం వ్యవహారాలు ముందుకు సాగుతాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ కేసు మీద చివరిది ఏదైనా కోర్టు తీర్పు మాత్రమే ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.