నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్‘ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి 2025 కి రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా తాలూకా సాంగ్స్, టీజర్స్ , ప్రమోషన్స్ సినిమా పై అంచనాలు పెంచేయగా…ఇప్పుడు మరో వార్త అభిమానులకు కిక్ ఇస్తుంది.
‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనంతపురంలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని టీడీపీ నాయకులు తెలిపారు. అనంతపురంలో బాలయ్య వైబ్ చూడబోతున్నాం అని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఇక ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. డాకు మహారాజ్ తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేయబోతున్నాడు బాలకృష్ణ. అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో అఖండ 2 మొదలైంది. ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది.